అక్షయ తృతీయ విశిష్టత ఏమిటి? అక్షయ తృతీయకు బంగారానికి సంబంధమేమిటి?
అక్షయ తృతీయ అనగానే మనందరికీ గుర్తొచ్చేది బంగారం కొనడం, చాలామందికి అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అది అక్షయం అవుతుందని, మనకు ఆర్థికంగా మన భవిష్యత్తు బాగుంటుందని చాలామంది నమ్ముతారు. అయితే అక్షయ తృతియకు అసలు బంగారంకు సంబంధం ఏమిటి? అక్షయ తృతీయ అసలు దేనికి సంబంధించింది? అక్షయ తృతీయ నాడు ఏమి చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి? అనేవి ఇప్పుడు చూద్దాం.
మనం ఆచరించే ఏ సాంప్రదాయానికైనా మూలం మన శాస్త్రాలు, పురాణాలు.మనం ఏ పూజలు చేసిన ఏ నోములు చేసిన ఏ ఆచరణ చేసిన వాటి ఆధారంగానే చేస్తుంటాం. కానీ అటువంటి శాస్త్రాలు ,పురాణాలలో అక్షయ తృతీయకి చాలా ప్రాధాన్యత ఉన్నది. కానీ ఎక్కడా కూడా ఆ రోజున బంగారం కొనుగోలు చేయాలి అని గాని,బంగారం కొనుగోలు చేస్తే అక్షయము అవుతుందని గాని ఎక్కడా కూడా లేదు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు అనేది మన తెలుగు సంప్రదాయం లో ముందు ఉండేది కాదు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ విషయం పదే పదే వినడం ద్వారా మన మనసులో నాటుకు పోయి అది ఒక ఆచారంగా మారింది.దానికి తోడు కార్పొరేట్ వ్యాపార సంస్థలు తమ వ్యాపార అభివృద్ధికి కొరకు చేసిన ప్రకటనల మహిమ ఒకటి. అక్షయ తృతీయ నాడు చాలామంది తమ వద్ద డబ్బులు లేకపోయినప్పటికీ అప్పులు చేసి మరీ బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు ఇది చాలా పెద్ద తప్పు. సాధారణంగా బంగారం లక్ష్మీస్వరూపం మన వద్ద ఆర్థిక పరిపుష్టత ఉన్నప్పుడు బంగారం కొనుగోలు చేయడంలో ఎలాంటి తప్పులేదు. అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ అప్పులు చేసి కొనుగోలు చేయడం మంచి పద్ధతి కాదు.
అక్షయ తృతీయ దేనికి సంబంధించింది? ఆరోజు మనం ఏమి చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి?
అక్షయ తృతీయ గురించి పురాణాలు, మన గ్రంధాలలో చాలా రకాల ప్రస్తావనలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వసంత రుతువు, శుక్లపక్షం, వైశాక మాసంలో మూడవరోజు అనగా శుద్ధ తదియ లేదా తృతీయనే అక్షయ తృతీయ అంటారు. అక్షయ తృతీయ పేరులోనే ఉన్నట్లు అక్షయము అనగా క్షయము కానిది అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అయితే అక్షయ తృతీయనాడు మనం ఏమి చేస్తే అక్షయంగా మనకు శుభ ఫలితాలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
అక్షయ తృతీయ నాడు దిగువ తెలిపిన అంశాలలో ఏ అంశము మీ శక్తి మేరకు అవకాశం ఉంటుందో అవి చేసినచో మంచి ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు,పురాణాలు చెబుతున్నాయి.
1. దానాలు:-
మన పురాణాలలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది.ఉదాహరణకు కార్తీక మాసం దీపానికి ,మాఘ మాసం స్నానానికి అలాగే వైశాఖమాసం దానాలకు ప్రసిద్ధి అని చెప్పబడుతుంది. అలాంటి వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయ నాడు చేసే దానాలు మనకు, మన కుటుంబానికి అక్షయ ఫలితాలను ఇస్తుందనేది శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఏమిటి దానాలుగా ఇవ్వాలి. వైశాఖ మాసం లో సూర్య ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. కనుక దాని నుండి ఉపశమనం పొందే దానాలు అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం
i.ఉదకుంభ ధానం :-
ఉదకుంభదానం అనగా చల్లటి మంచి తాగు నీరు మట్టి కుండలో నింపి మూత పెట్టి ఎవరైనా యజ్ఞ యాగాదులు, క్రతువులు నిర్వహించే బ్రాహ్మణునికి లేదా ఏదైనా చలివేంద్రం రూపంలో ఏర్పాటు చేసినచో మీకు అక్షయ ఫలితం ఉంటుంది.
ii. వస్త్ర దానం :-
శాస్త్రం ప్రకారం వస్త్రం అనగా అంచు ఉన్న ఏదైనా వస్త్రం అని అర్థం .కాబట్టి ఏదైనా అంచు ఉన్న ఒక పంచె షాపు ను ఆరోజున బ్రాహ్మణునికి దానం చేస్తే మీకు జీవితకాలం వస్త్రానికి లోటు లేకుండా ఉంటుంది అనేది దీని అర్థం. ఇంకా మీ శక్తి మేరకు పేదవానికి చేసిన మంచి శుభ ఫలితాలు వస్తాయి.
iii.అన్నదానం లేదా స్వయంపాకం :-
ఈ రోజున బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చినా సరే లేదా ఎవరైనా పేదవాళ్లకు అన్నదానం ముఖ్యంగా పెరుగు అన్నం దానం చేసినా సరే అక్షయ ఫలితం అనగా మీ జీవితకాలం తిండికి లోటు లేకుండా ఉంటుందనేది శాస్త్రం చెబుతుంది.
iv.చత్రదానం మరియు చెప్పుల దానం :-
వైశాఖమాసం లో సూర్యకాంతి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.దాని నుండి ఉపశమనం పొందడానికి ఎవరైనా బ్రాహ్మణునికి లేదా బీదవానికి చత్రదానం అనగా గొడుగును అలాగే చెప్పుల దానం చేసినచో మీకు శుభ ఫలితాలు ఉంటాయి అనేది పురాణాలు చెబుతున్నాయి.వీటితోపాటు విసనకర్ర దానం చేసిన మంచిదే.
పైన చెప్పిన వాటితో పాటు మీ యధాశక్తి ఎవరికి తోచిన దానాలు వారు చేసినచో శుభ ఫలితాలు ఉంటాయి.
2.చందన లేపన పూజ :-
వైశాఖమాసం విష్ణువుకి ప్రీతికరమైన మాసం. అక్షయ తృతీయ నాడు సింహాచలం లో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మి నారసింహ స్వామి వారికి చందనోత్సవం జరుపుతారు. చందనోత్సవం అనగా స్వామి వారు సంవత్సరం మొత్తం కూడా చందన లేపనంతో లింగాకారంలో కనిపిస్తారు. కానీ అక్షయ తృతీయ నాడు చందనం మొత్తం తొలగించి నిజరూప దర్శనం ఇస్తారు. దానినే చందనోత్సవం అంటారు. మనం కూడా అక్షయ తృతీయ నాడు మన ఇంట్లో విష్ణు లేదా శివ ప్రతిమలకు చెందన లేపనంతో పూజించినచో శుభ ఫలితాలు ఉంటాయి.
3.జపం:-
ఈ రోజున శ్రీ లక్ష్మీనారాయణ లకు మన శక్తిమేరకు పూజిస్తే మనకు అత్యంత శుభ దాయకం.
ఈ రోజున వేకువ జామున లేచి తలంటి స్నానం చేసి లక్ష్మీనారాయణల లేదా మీ ఇష్ట దైవం లకు జపం చేసినచో అక్షయ ఫలితాలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అనేది ఒక నమ్మకం. జపంతోపాటు ఎవరు శక్తి మేరకు వారు హోమం చేసినా సరే శుభ ఫలితాలు ఉంటాయి.
4.పితృ తర్పణం:-
అక్షయ తృతీయ నాడు పితృతర్పణమునకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆరోజు పితృతర్పణం చేసినచో మన పెద్దలు మనకు శుభ ఫలితాలను అందిస్తారు.
5.సముద్ర స్నానం (సంకల్ప సహిత) :-
అక్షయ తృతీయ నాడు సముద్ర స్నానం అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. సముద్ర స్నానం అవకాశం లేనివారు దగ్గర్లో ఉన్న ఏదైనా పవిత్ర నదులలో లేదా జలాలలో స్నానం చేసిన శుభ ఫలితాలు వస్తాయి. ఇంకా అవకాశం లేని వారు చెరువు లో స్నానం చేసిన శుభ ఫలితాలు వస్తాయి. అది అవకాశం లేని వారు ఏదైనా భావి లేదా ఇంటి వద్దనే ఉన్న ఏదైనా గంగాజలంతో స్నానం చేసేటప్పుడు గంగాదేవిని స్మరించుకుంటూ స్నానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి.
చూశారు కదా అక్షయ తృతినాడు మనం ఏం చేస్తే శుభ ఫలితాలు వస్తాయో వాటిని మీ శక్తి మేరకు అమలు అయ్యే విధంగా చూడండి. అంతేగాని మీకు స్తోమత లేకపోయినా బంగారం కొనగలు చేయాలనే నమ్మకాన్ని వదిలి హాయిగా మనస్ఫూర్తిగా లక్ష్మీనారాయణలను లేదా శివపార్వతులను లేదా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించి మంచి ఫలితాలను పొందండి.
అక్షయ తృతీయ నాడు పురాణాలలో చెప్పిన మరికొన్ని సంఘటనలు
అక్షయ తృతీయ నాడు పురాణాలలో చాలా ఘటనలు ఉన్నాయని మన పెద్దలు చెప్తారు అందులో ముఖ్యంగా
1. సింహాచలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి చందనోత్సవం
2. పరశురాముని జన్మదినం
3. పవిత్ర గంగానది భూమిని తాకిన రోజుగా
4. ఈ రోజునే కృతయుగం మొదలయింది అని
5. శ్రీకృష్ణుడి ని తన బాల్యమిత్రుడైన కుచేలుడు కలుసుకున్న దినం అని
6. వ్యాసమహర్షి మహాభారతమును విగ్నేశ్వరుని సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు అని
7. వనవాసంలో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్ర ఇచ్చిన రోజు అని
8. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసుని బారి నుండి కాపాడిన రోజు అని
9. కనకధారాస్తవం ను ఆది శంకరులు చెప్పిన రోజని
10. ఒడిస్సా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథం ఈరోజనే నిర్మాణం ప్రారంభిస్తారని
11. శివున్ని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడిన రోజని
చెప్తారు.
చూశారు కదా అక్షయ తృతీయ విశిష్టత కనుక ఈ అక్షయ తృతీయనాడు ఆ భగవంతుడు మీ అందరికీ మంచి శుభ ఫలితాలను ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. శుభం.
You Might Like This :
జీవితం లో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన రామ ఆలయాలు
Tirupati Darshn Types | వెంకటేశ్వర స్వామి ని ఏన్ని పద్ధతులలో దర్శించుకోవచ్చు.