Tirupati Darshn Types | వెంకటేశ్వర స్వామి ని ఏన్ని పద్ధతులలో దర్శించుకోవచ్చు.

 Tirupati Darshn Types | వెంకటేశ్వర స్వామి ని ఏన్ని పద్ధతులలో దర్శించుకోవచ్చు.


Tirupati Darshn
వెంకటేశ్వర స్వామి ని ఏన్ని పద్ధతులలో దర్శించుకోవచ్చు?

ప్రపంచ నలుమూలలలో హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కలియుగ ప్రత్యక్ష దైవము ఆపదమొక్కులవాడు , అనాధ రక్షకుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమ జీవితంలో ఒక్కసారి అయినా దర్శించుకోవాలి అని అనుకుంటారు. స్వామివారి వైభవం ప్రపంచ నలుమూలల వ్యాప్తి చెంది రోజురోజుకీ స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య వేల నుండి లక్షలకు చేరుకుంటుంది. అయితే చాలా కుటుంబాలు చిన్న పిల్లలతో వృద్ధులతో ఎటువంటి ముందస్తు ప్రణాళికా లేకుండా తిరుపతికి వచ్చి స్వామివారి దర్శనం కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఎన్ని రకాలుగా అవకాశం ఉంది, వాటిని మనం ఎలా పొందాలో ఇప్పుడు పూర్తిస్థాయిలో చూద్దాం.

మనం వెంకటేశ్వర స్వామి వారిని దిగువ తెలిపిన పద్ధతుల్లో ఏ పద్ధతిలోనైనా మనం దర్శించుకోవచ్చు.

1. సర్వ దర్శనం:-

ఈ దర్శనానికి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వెళ్లవచ్చు. చాలామంది స్వామివారి దర్శనానికి ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా తిరుమల చేరుకునే వారికి సర్వదర్శనం మార్గం ద్వారా స్వామివారి దర్శనానికి పంపిస్తారు. ఈ దర్శనం భక్తుల రద్దీను బట్టి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని సందర్భాలలో 24 గంటలు దాటి కూడా పట్టవచ్చు. అయితే అందుకు తగ్గట్టుగానే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎక్కడికి అక్కడ క్యూలైన్లో మరుగుదొడ్ల సదుపాయం, అదేవిధంగా సమయానుకులంగా ఆహార ఏర్పాట్లు,ఎక్కడికక్కడ మంచినీటి ఏర్పాట్లు చేసి ఉంటారు. కొంతకాలం క్రితం వరకు కోవిడ్ కాలంలో ఈ దర్శనం కి కూడా ఆన్లైన్లోనే టికెట్లు మంజూరు చేసేవారు కానీ ప్రస్తుతం సర్వదర్శనం కొరకు తిరుమలలో డైరెక్ట్ గానే దర్శనానికి పంపిస్తున్నారు.

2. స్లాట్ దర్శనం (సర్వదర్శనం):-

ఇది కూడా సర్వదర్శనం మాదిరిగానే ఉచిత దర్శనం. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు సర్వదర్శనం వరుసలలో అత్యధిక జనం ఎక్కువ సమయం కాపలా ఉండి ఇబ్బందులు పడుతున్నారని విషయాన్ని గ్రహించి ఈ స్లాటెడ్ దర్శనాన్ని ప్రవేశపెట్టారు. తిరుమల దర్శనానికి వచ్చిన ప్రజలు సర్వదర్శనం లైన్ లోకి నేరుగా వెళ్లకుండా ముందుగా ఈ స్లాటేట్ దర్శనం టికెట్ను తీసుకున్న ఎడల వారికి దర్శనానికి ఒక సమయాన్ని కేటాయిస్తారు ఆ సమయంలో దర్శనంకి వెళ్లినచో స్వామి వారిని అది తక్కువ కాలంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా దర్శించుకుని బయటకు రావచ్చు. అయితే ప్రస్తుతము ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి దిగువ తిరుపతి లో కింది తెలిపిన ప్రదేశాలలో మాత్రమే ఈ స్లాటెడ్ దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. కావున స్లాటెడ్ దర్శనం కావలసిన భక్తులు ఐదు గంటలకు ముందు నే ఆ ప్రదేశం కి చేరుకొని ఉన్నట్లయితే స్లాటెడ్ దర్శనం టోకెన్ లభించే అవకాశం ఉంటుంది.

దిగువ తిరుపతిలో స్లాటెడ్ దర్శనం టోకెన్లను (SLOTED SARVA DARSHAN TOKENS)జారీ చేసే ప్రదేశాలు :-

1. గోవిందరాజు సత్రాలు:- ఇది తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక భాగంలో వుంటుంది. చివరి ప్లాట్ ఫామ్ నుండి వెళ్ల వచ్చు.

2. శ్రీనివాసం కాంప్లెక్స్:- ఇది తిరుపతి మెయిన్ బస్ స్టేషన్ కు ఆపోజిట్ వైపు ఉంటుంది.

3.భూదేవి కాంప్లెక్స్ :- ఇది అలిపిరి బస్ స్టేషన్కు దగ్గరగా ఉంటుంది.

Note:- ప్రస్తుతానికి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను కేవలం తిరుపతిలో మాత్రమే ఇస్తున్నారు. మీద తిరుమల లో ఇవ్వడం లేదు. ఉదయం ఐదు గంటల నుండి టోకెన్లు పూర్తి అయ్యేవరకు ఈ టోకెన్లను మంజూరు చేస్తారు. తరువాత నిలుపుదల చేస్తారు. ఈ టోకెన్లు దొరకని వారు నేరుగా తిరుమల కు వెళ్లి సర్వదర్శనం లైన్లో స్వామివారిని దర్శించుకోవచ్చు.ఈ టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి స్వామివారి లడ్డు ఒకటి ఉచితంగా ఇస్తారు.

3. 300 రూపాయల స్పెషల్ దర్శనం:- 

ప్రతి ఒక్కరూ సర్వదర్శనంలో ఎక్కువ రద్దీతో ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకోవాలి అనుకునే వారు ఈ దర్శనం టోకెన్లు తీసుకొని తక్కువ సమయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు .ఈ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం Web site (  https://tirupatibalaji.ap.gov.in )  లో విడుదల చేస్తారు. ఏ నెల టికెట్లను ఏ తేదీన విడుదల చేస్తారో ముందుగా ఆ వెబ్సైట్లో తెలియజేయడం జరుగుతుంది.తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి ముందుగా ప్రణాళిక ప్రకారం ఏ నెలలో ఏ తేదీలలో  అయితే మనం వెళ్లాలనుకుంటున్నామో ఆ నెలకు సంబంధించి ఒక్కొక్కరికి 300 టికెట్ తీసుకొని ముందుగా నిర్ణయించిన తేదీలలో ఆ సమయానికి దర్శనానికి వెళ్ళవచ్చు. ఈ టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి స్వామివారి లడ్డు ఒకటి ఉచితంగా ఇస్తారు. ఈ దర్శనానికి వెళ్లే వారు సంప్రదాయ దుస్తులతో మాత్రమే అనుమతిస్తారు.

4.తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల  ద్వారా దర్శనం:-

గత మూడు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా కాలినడకన వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లను నిలుపుదల చేశారు. అయితే ఏప్రిల్ ఒకటి 2023 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రయోగాత్మకంగా అలిపిరి మార్గం ద్వారా వెళ్లే భక్తులకు 10000 దర్శనం టోకెన్లు మరియు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లే భక్తులకు 5000 టికెట్లు జారీ చేయడం ప్రారంభించారు. రాబోవు కాలంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ టిక్కెట్లను పెంచే అవకాశం ఉంది. ఈ టిక్కెట్లను ఉదయం 5 నుంచి అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద ,శ్రీవారిమెట్టు మార్గంలో 1250వ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లను ఏప్రిల్ 1వ తేదీ నుండి కేటాయిస్తున్నారు. నడక దారిలో వెళ్లే భక్తులు కచ్చితంగా తమ ఆధార్ కార్డు చూపించి ఈ దర్శనం టికెట్లను పొందవచ్చు.

5. వయోవృద్ధులు, వికలాంగులు మరియు కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి  దర్శనం టికెట్లు:-

65 సంవత్సరాల పైబడిన వృద్ధులు, వికలాంగులు, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎటువంటి క్యూలైన్లలో తోపులాట లేకుండా, ఎక్కువ సమయం కాపలా లేకుండా సునాయాసంగా దర్శనం చేసుకోవడానికి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు వీరి కోసం ప్రత్యేక దర్శనం  ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ టికెట్లను కూడా ఆన్లైన్లోనే జారీ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెబ్ సైట్ లో ముందుగా రాబోవు నెలలకు సంబంధించి టికెట్లను ప్రస్తుత నెలలో ఏ తేదీన ఈ టిక్కెట్లను విడుదల చేస్తారో ముందుగా ప్రచురించడం జరుగుతుంది. వాటిని మనం గమనించుకుంటూ టికెట్లను తీసుకోవాలి. 65 సంవత్సరాల పైబడిన వయసు గలవారు వయసు ధ్రువీకరణ పత్రం కచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. వికలాంగులు వారి యొక్క వికలాంగ ధ్రువీకరణ పత్రము (రాష్ట్రా లేదా కేంద్ర ప్రభుత్వం వారు జారీ చేసిన సర్టిఫికెట్) తీసుకువెళ్లాలి. అదేవిధంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ ,డయాలసిస్ ,లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్,బ్రెయిన్ సర్జరీ , క్యాన్సర్, వెన్నుముక సర్జరీ లాంటి ప్రత్యేకమైనటువంటి అనారోగ్య సమస్యల తో బాధపడుతున్న వారు సంబంధిత పత్రాలను చూపించి దర్శనం చేసుకోవచ్చు. పైన తెలిపిన ఈ మూడు సందర్భాలలో ప్రతి ఒక్కరితో వారి యొక్క
భార్య లేదా భర్తను అటెండర్ గా దర్శనానికి  తీసుకొని వెళ్లవచ్చు. ఈ టికెట్ కలిగిన భక్తులు దక్షిణ మాడవీధి వద్ద గల బ్రిడ్జి దగ్గరకు 1 గంట నుండి  వెళ్ళాలి.

6. సంవత్సరం లోపు వయసుగల పిల్లల తల్లిదండ్రులకు దర్శనం:-

ఎవరైనా దంపతులకు సంవత్సరంలోపు వయసు గల పిల్లలు ఉన్నట్లయితే వారికి సంబంధించిన వయసు ధ్రువీకరణ పత్రం చూపించి స్వామివారి దర్శనాన్ని ఎటువంటి క్యూ లైన్లు లేకుండా తక్కువ సమయంలో దర్శించుకోవచ్చు. ఈ దర్శనం చేసుకోవాలి అనుకునేవారు ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుండి 6 గంటల వరకు సుపతం మార్గం దగ్గరకు వెళ్లి చేసుకోవచ్చు. వీటికి ప్రత్యేకించి ఎటువంటి టిక్కెట్టు అవసరం ఉండదు.

7. అంగ ప్రదక్షిణం మరియు దర్శనం:- 

అంగ ప్రదక్షిణం అనగా శ్రీవారి ఆలయము లోపల ఆనంద నిలయం చుట్టూ వేకువ జామున 3 గంటలకు అంగప్రదక్షిణం చేస్తే మహాత్భాగ్యాన్ని కలిగించే ఒక సేవ. ఈ టిక్కెట్లను కోవిడ్ ముందు వరకు తిరుమలలో ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉచితంగా ఇచ్చేవారు కానీ ప్రస్తుతం ఈ టికెట్లు కూడా ఆన్లైన్లోనే జారీ చేస్తున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెబ్ సైట్ లో ముందుగా రాబోవు నెలలకు సంబంధించి టికెట్లను ప్రస్తుత నెలలో ఏ తేదీన ఈ టిక్కెట్లను విడుదల చేస్తారో ముందుగా ప్రచురించడం జరుగుతుంది. వాటిని మనం గమనించుకుంటూ టికెట్లను తీసుకోవాలి. ఈ టికెట్ పొందిన వారు అర్ధరాత్రి ఒంటిగంటకు శ్రీవారి పుష్కరిణి లో స్నానం చేసి అక్కడి నుండి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు చేరుకోవాలి. అంగ ప్రదక్షిణం చేసిన వెంటనే సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తారు.

పైన తెలిపిన దర్శనాలతో పాటు ఆర్జిత సేవలు మరియు వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం మొదలగు దర్శనాలను తదుపరి పోస్ట్ లో తెలియజేయడం జరుగుతుంది. ఆన్ లైన్ లో పైన తెలిపిన దర్శనాల టికెట్లను ఏ విధంగా బుక్ చేయాలో తదుపరి పోస్టులో తెలియజేయడం జరుగుతుంది.



1 Comments

Previous Post Next Post