సదరం అంటే ఏమిటి ? సదరంపై ప్రశ్నలు సమాధానాలు?

జూలై 6 తారీఖు ఉదయం 10 గంటలకు జూలై,ఆగస్ట్,సెప్టెంబర్ నెలలకు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రారంభం. 

sadharam certificate

జూలై,ఆగస్ట్,సెప్టెంబర్ మూడు నెలలకు సంబంధించి స్లాట్ బుకింగ్ :

 జూలై,ఆగస్ట్, సెప్టెంబర్ మూడు నెలలకు సంబంధించి జూలై 10వ తారీఖు ఉదయం 10 గంటలకు స్లాట్ బుకింగ్ ఆన్లైన్ లో ఓపెన్ చేస్తుంది. కావున దీనికోసం వేచి ఉన్న ప్రతి ఒక్కరూ మీకు దగ్గర్లో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి గాని లేదా మీసేవ కేంద్రానికి గాని వెళ్లి స్లాట్ బుక్ చేసుకోగలరు. అయితే ఇప్పటివరకు ఏ జిల్లాకు చెందిన వారు అదే జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ లోనే స్లాట్ బుక్ చేసుకొని ఆ తేదీన టెస్టింగ్ చేసుకోవడానికి హాజరు కావాల్సి ఉండేది కానీ విద్య, ఉపాధి , మరియు ఇతర అవసరాల నిమిత్తం సొంత జిల్లాలను విడిచి వేరే జిల్లాల్లో ఉంటున్న వారి కోసం ఈసారి రాష్ట్రంలో వేరే జిల్లాలలోనూ సదరం సర్టిఫికెట్ పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. అయితే అసలు సదరం సర్టిఫికెట్ అంటే ఏమిటి? అది ఏవిధంగా పొందాలి ? దాని యొక్క ప్రయోజనాలు ఏమిటి ? ఒకవేళ మొదటిసారి సర్టిఫికెట్ రానియెడల మరల పొందడానికి అవకాశం ఉందా ? లేదా ? మొదలగు పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

సదరం సర్టిఫికెట్ అంటే ఏమిటి (What is SADAREM Certificate) ? :- 

ఎవరైనా వ్యక్తికి శారీరిక ,మానసిక లోపాలు గాని, కంటి సమస్యలు గానీ లేదా మరి ఏ ఇతర లోపంతో బాధపడుతున్న అటువంటి వారి లోపాన్ని నిర్ధారిస్తూ ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని సదరం సర్టిఫికెట్ అంటారు. అయితే వీటిని ప్రభుత్వం నిర్దేశించిన హాస్పిటల్స్ లో మాత్రమే జారీ చేస్తారు .

సదరం సర్టిఫికెట్ పొందడం ఎలా ? (HOW TO GET SADAREM Certificate) ?

సదరం సర్టిఫికెట్ కావాలి అన్నవారు మీకు దగ్గరలో ఉన్న గ్రామా వార్డు సచివాలయానికి గాని లేదా మీసేవ కేంద్రానికి గాని వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకోవడం అంటే ప్రభుత్వం వారు రాబోవు నెలలలో ఏ ఏ తేదీలలో సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తారో ముందుగానే తెలియజేస్తూ ప్రకటన చేస్తారు. అప్పుడు మీ వివరాలతో పాటు ఆన్లైన్లో మీకు చూపించిన ఆసుపత్రులలో మీకు దగ్గరగా ఉన్న ఆస్పత్రిని ఎంపిక చేసుకున్న యెడల మీకు ఒక తేదీని మరియు సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. దానినే స్లాట్ బుకింగ్ అంటారు. మీకు కేటాయించిన తేదీ మరియు సమయానికి కచ్చితంగా మీరు కోరుకున్న హాస్పిటల్ కి వెళ్లి పరీక్ష చేయించుకున్నచో మీకు అర్హత ఉన్న ఎడల సదరం సర్టిఫికెట్ మంజూరు చేస్తారు.

స్లాట్ బుకింగ్ కు ఏమేమి కావాలి ? (What are the Requirements to Book a Slot) ?

మీరు మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి లేదా మీ సేవకు వెళ్లేటప్పుడు దిగువ తెలిపిన వివరాలు ఉండాలి.

1. ఆధార్ కార్డు 

2. అప్లికేషన్ ఫారం

3. ఆధార్ కార్డుకు లింక్ అయిన ఫోన్ నెంబరు 4.పుట్టుమచ్చల(రెండు) వివరాలు


ఏదైనా ప్రభుత్వ పథకం అర్హత సాధించాలి అన్న ఎంత వికలాంగ శాతం ఉండాలి ?

ప్రభుత్వ పరంగా దివ్యాంగులకు వర్తించే పథకాలు ఉదాహరణకు వికలాంగు పెన్షన్, బస్సు మరియు ట్రైన్ పాసులు,మరియు ఇతర రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్లు పొందడానికి కనీసం 40 శాతం వికలాంగత్వం సర్టిఫికెట్ ఉండాలి.

తాత్కాలిక సదరం సర్టిఫికెట్ లేదా రీ అసెస్మెంట్ సిఫార్సు సర్టిఫికెట్ ఉంటే ఏమి చేయాలి ?

కొంతమందికి తమకు ఏదైతే లోపం ఉందో అని వారు భావిస్తారో ఆ లోపం కొంత కాలానికి పూర్తిస్థాయిలో నయమవుతుందనే ఉద్దేశంతో డాక్టర్లు వారికి తాత్కాలిక సర్టిఫికెట్ లేదా రీ అసెస్మెంట్ సర్టిఫికేట్ పేరుతో కొంత కాలానికి మంజూరు చేస్తారు. అయితే వారు ఇచ్చిన కాలానికి కూడా వారి లోపం నయం కానీయడల మరల సర్టిఫికెట్ కొరకు మనం Hospital నుండి పైకి పంపిస్తే వారు మరల స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. స్లాట్ బుక్ చేసిన తరువాత డాక్టర్ కు చూపించిన యెడల శాశ్వత సర్టిఫికెట్ మంజూరు చేస్తారు.

తాత్కాలిక సర్టిఫికెట్ తో పెన్షన్ మంజూరు చేయవచ్చా ?

తాత్కాలిక సర్టిఫికెట్ ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి పెన్షన్ దరఖాస్తు చేయలేము. మరల శాశ్వత సర్టిఫికెట్ తీసుకొచ్చిన యెడల పెన్షన్ కి దరఖాస్తు పెట్టగలరు.

సదరం క్యాంపులో రిజెక్ట్ అయిన కేసులకు తిరిగి సర్టిఫికెట్ పొందవచ్చా ?

చాలామందికి సదరం క్యాంపుల్లో వారికి సరైన వికలాంగ శాతం అనగా 40 శాతానికి కంటే తక్కువ ఇస్తూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటివారు వారికి అర్హత ఉంది అని భావిస్తే ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న స్పందన కార్యక్రమాల్లో దరఖాస్తు చేసిన యెడల వారికి జిల్లాలో ఉన్న ఏదో ఒక హాస్పిటలకు రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడకు వెళ్లి డాక్టర్ గారికి చూపించిన ఎడల ఆ డాక్టర్ గారు వీరికి రీ అసెస్మెంట్ కి అర్హత ఉంది అని భావిస్తే, వారు తీసుకున్నఓపి ఫారం మీద ఎలిజిబుల్ ఫర్ రీ అసెస్మెంట్ అంటూ రాస్తూ, వైద్య విధాన పరిషత్ కు ఒక లేఖ రాస్తారు. ఆ విధంగా ఆ వ్యక్తికి మళ్లీ రీఅసెస్మెంట్ కి అవకాశాన్ని కల్పిస్తారు.

సదరం సర్టిఫికెట్ ఉపయోగాలు ఏమిటి ?

సదరం సర్టిఫికెట్ వలన దిగువ తెలిపిన ఉపయోగాలు ఉన్నాయి .

1. ప్రభుత్వం వారు దివ్యాంగులకు ఇచ్చే 3000 రూపాయలు పెన్షన్ రావాలి అని అంటే కచ్చితంగా సదరం సర్టిఫికెట్ ఉండాలి. అది కూడా శాశ్వతంగా అసెస్మెంట్ చేసిన సదరం సర్టిఫికెట్ కావాలి. తాత్కాలిక సదరం సర్టిఫికెట్లు పనికిరావు.

2. సదరం సర్టిఫికెట్ గల వ్యక్తులు కు బస్సు మరియు రైలు ప్రయాణాలలో రాయితీలు ఉంటాయి.

3. సదరం సర్టిఫికెట్ కలిగిన వ్యక్తులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసే ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉంటాయి.

4. కొన్ని సందర్భాలలో వీరికి ప్రత్యేక వాహనాలు, మరియు పరికరాలు ప్రభుత్వము నుంచి ఉచితంగా లేదా రాయితీ రూపంలో సరఫరా చేస్తూ ఉంటారు.

సదరం Acknowledgement ను పొందడం ఎలా ?

మీరు దగ్గర్లో ఉన్న సచివాలయం లేదా మీ సేవలో సదరంకు దరఖాస్తు చేసిన యెడల మీకు అక్కడ ఒక సదరం ఐడి తో కూడిన రశీదు ఇస్తారు. దానిమీద ఉన్న సదరం ఐడి భద్రపరచుకోండి. ఒకవేళ రసీదు పోయిన యెడల సదరం ఐడితో దిగువ తెలిపిన విధంగా మరలా రసీదు పొందవచ్చు.

ముందుగా దిగు తెలిపిన లింకుపై క్లిక్ చేయండి.

 Download Link : Click Here

క్లిక్ చేసిన తరువాత సదరం ఐడి మరియు అక్కడ కనిపిస్తున్న క్యాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వివరాలు ఓపెన్ అవుతాయి దాని ద్వారా  acknowledgement డౌన్లోడ్ చేసుకోండి.

ఇన్ని సదుపాయాలు ఉన్న సదరం సర్టిఫికెట్ గురించి తెలియక చాలామంది అర్హులైన వారు చాలా నష్టపోతున్నారు. కావున ఈ పోస్ట్ చదివిన తర్వాత మేలుకొంటారని కోరుకుంటున్నాం. మేము చెప్పిన ఈ అంశాలు కేవలం విషయపరిజ్ఞానానికి మాత్రమే పూర్తి వివరాలు కొరకు మీకు దగ్గరలో ఉన్న సచివాలయాన్ని సందర్శించగలరు.



1 Comments

Previous Post Next Post