జనన మరియు మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడం ఎలా ?
జనన ధ్రువీకరణ పత్రం పొందడం ఎలా ?
ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మొట్టమొదటి గుర్తింపు పత్రం జనన ధ్రువీకరణ పత్రం. అయితే ఈ జనన ధ్రువీకరణ పత్రం యొక్క ఉపయోగాలు తెలియక చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అందుకే ఈ పోస్ట్ ద్వారా జనన ధ్రువీకరణ పత్రము ఎక్కడ నమోదు చేయాలి, ఎన్ని రోజుల్లోపు నమోదు చేయాలి, ఒకవేళ నమోదు చేయని యెడల మరల ఏ విధంగా నమోదు చేసుకోవాలి మొదలగు అంశాలన్నీ కూలంకుషంగా వివరించడం జరిగింది.
జనన నమోదు పత్రం అంటే ఏమిటి? అది ఏ విధంగా నమోదు చేసుకోవాలి?ఎక్కడ నమోదు చేసుకోవాలి?
1. జనన ధ్రువీకరణ పత్రం అంటే ఒక మనిషి ఏ తేదీన ఏ సంవత్సరం ఎక్కడ జన్మించారో తెలియజేసేది. బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకు సంబంధించిన ఎవరైనా రక్తసంబంధీకులు వెళ్లి వివరాలు చెప్పి నమోదు చేసుకోవచ్చు.
2. మీకు బాబు లేదా పాప పుట్టిన 21 రోజుల లోపు నమోదు చేసుకోవాలి. ఒకవేళ 21 రోజుల లోపు బిడ్డకు పేరు పెట్టకపోయినప్పటికీ పేరు స్థానంలో ఖాళీ వదిలి నమోదు చేస్తారు.
3. జనన నమోదు బిడ్డ పుట్టిన ప్రదేశం దిగువ తెలిపిన ప్రదేశాలలో దేని పరిది లోకి వస్తే అక్కడే నమోదు చేసుకోవాలి.
i. గ్రామ పంచాయతీ కార్యాలయం
ii. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం
iii. ఒకవేళ బిడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి లో నమోదు చేస్తారు.
గమనిక:- బిడ్డ ఎక్కడైతే జన్మిస్తారో ఆ ప్రాంతంలోని మాత్రమే నమోదు చేస్తారు అనగా ఉదాహరణకు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక గర్భిణీ వేరే ప్రాంతంలో ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రిలోకి వెళ్లి అక్కడ డెలివరీ అయినచో ఆ ప్రాంతము మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ అయితే గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి నమోదు చేసుకోవాలి అంతే తప్ప సొంత గ్రామంలోనే చేసుకోవాలి అనే అపోహ పెట్టుకోవద్దు. ఒకవేళ ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించినట్లయితే అక్కడే జనన నమోదు పత్రము రిజిస్టర్ చేస్తారు.
ఒకవేళ నమోదు చేసుకోవడం మర్చిపోతే ఏమి చేయాలి?
1. ఎవరైనా తమ బిడ్డ పుట్టిన 21 రోజుల లోపు నమోదు చేసుకొని ఎడల దిగువ పద్ధతిలో మరల నమోదు చేసుకోవచ్చు.
I. బిడ్డ పుట్టిన సంవత్సరం లోపు
బిడ్డ పుట్టిన సంవత్సరం లోపు అయితే మండల తహసీల్దారు వారి ఉత్తర్వులు ద్వారా తిరిగి నమోదు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి NON AVAILABILITY CERTIFICATE అనగా జనన నమోదు రికార్డులో నమోదు కాలేదు అని తెలియజేసిన సర్టిఫికెట్ తీసుకోవాలి. తరువాత లాయర్ వద్దనుండి నోటరీ సర్టిఫికెట్ తీసుకోవాలి తరువాత బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసిన ఎడల తాసిల్దార్ కార్యాలయం నుండి విచారణ జరిపి మరల గ్రామ పంచాయతీ రికార్డులను నమోదు చేయమని ఉత్తర్వులు జారీ చేస్తారు.
Note:- తాసిల్దారు గారు ఇచ్చిన ఈ ఉత్తర్వులునే చాలామంది బర్త్ సర్టిఫికేట్ గా భావించి తమ వద్ద ఉంచుకుంటుంటారు అది తప్పు, ఈ ఉత్తర్వులను తిరిగి గ్రామపంచాయతీ కార్యదర్శి వారికి ఇస్తే రికార్డులో నమోదు చేసి బర్త్ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు.
బిడ్డ పుట్టి సంవత్సరం దాటిన తరువాత
1. బిడ్డ పుట్టిన సంవత్సరం లోపు అయితే మండల తాహాశీల్దారు గారు ఉత్తర్వులు జారీ చేస్తారు సంవత్సరం దాటిన తర్వాత గౌరవ రెవిన్యూ డివిజనల్ అధికారి వారు ఉత్తర్వులు జారీ చేస్తారు.
2. ఈ ఉత్తర్వులు జారీ చేయడం కోసం కూడా పైన తెలిపిన పద్ధతిలోని నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ మరియు నోటరీ తయారు చేసి ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ విచారణ జరిపి తహసిల్దార్ వారి ద్వారా డివిజనల్ రెవిన్యూ అధికారి వారికి పంపిస్తారు.
3. రెవెన్యూ డివిజనల్ అధికారి వారు ఇచ్చిన ఉత్తర్వులను తీసుకువచ్చి గ్రామపంచాయతీ కార్యదర్శి వారికి ఇచ్చినచో మరల ఆన్లైన్ లో నమోదు చేసి బర్త్ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు.
జనన నమోదు పత్రం ఉపయోగాలు:-
జనన నమోదు పత్రం వలన మన జీవితంలో అనేక ఉపయోగాలు ఉన్నాయి.
1. భారతదేశం మొత్తం ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చే ఆధార్ కార్డు నమోదు చేసుకోవడానికి బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరిగా అవసరం.
2. పిల్లలు ఏదైనా పాఠశాలలో చేరడానికి బర్త్ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది.
3. పిల్లలను రైస్ కార్డ్ లో చేర్చుటకు బర్త్ సర్టిఫికెట్ అవసరము.
4. వివాహ సమయంలో వయసు ధ్రువీకరణకు జనన ధ్రువీకరణ పత్రం అవసరం.
5. ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు బర్త్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది.
మరణ ధ్రువీకరణ పత్రం పొందడం ఎలా ?
ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషికి మొట్టమొదటి ధృవీకరణ పత్రం జనన ధ్రువీకరణ పత్రం అయితే చిట్టచివరి దృవీకరణ పత్రం మరణ ధ్రువకరణ పత్రం ఈ మరణ ధ్రువీకరణ పత్రం ఏ విధంగా పొందాలో ఇప్పుడు చూద్దాం.
మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి కూడా జనన ధ్రువీకరణ పత్రం లాగే నియమాలు ఉంటాయి. అవి ఏమిటంటే ఒక మనిషి మరణించిన 21 రోజుల లోపు గ్రామపంచాయతీ కార్యాలయము లేదా మున్సిపల్ కార్యాలయము లేదా ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించినట్లయితే ప్రభుత్వాసుపత్రిలో నమోదు చేసి మరణ ధ్రువీకరణ పత్రము పొందవలసి ఉంటుంది.
Note:- జనన ధ్రువీకరణ పత్రము మాదిరిగానే మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఎక్కడైతే వ్యక్తి మరణించారో ఆ ప్రదేశము ఏ పరిధిలోకి వస్తుందో అక్కడికి వెళ్లి నమోదు చేసుకోవాలి. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి ప్రమాదవశాత్తు ఏదైనా ఒక ప్రాంతంలో మరణించినచో ఆ ప్రాంతము ఏ గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుందో లేదా ఏదైనా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందో తెలుసుకొని అక్కడ మాత్రమే నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఆ వ్యక్తి సాధారణ మరణము ఇంటి వద్దనే జరిగితే గ్రామపంచాయతీకి వెళ్లి పంచాయతీ కార్యదర్శి వారికి వివరాలు తెలియజేసి నమోదు చేసుకొని మరణ ధ్రువీకరణ పత్రం పొందాలి.
మరణ సమయంలో మరణ నమోదు చేయకపోయినా ఎడల మరల ఏ విధముగా మరణ ధ్రువీకరణ పత్రం పొందాలి?
I. వ్యక్తి మరణించిన సంవత్సరం లోపు
వ్యక్తి మరణించిన సంవత్సరం లోపు అయితే మండల తహసీల్దారు వారి ఉత్తర్వులు ద్వారా తిరిగి నమోదు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి NON AVAILABILITY CERTIFICATE అనగా మరణ నమోదు రికార్డులో నమోదు కాలేదు అని తెలియజేసిన సర్టిఫికెట్ తీసుకోవాలి. తరువాత లాయర్ వద్దనుండి నోటరీ సర్టిఫికెట్ తీసుకోవాలి తరువాత death సర్టిఫికెట్ కోసం అప్లై చేసిన ఎడల తాసిల్దార్ కార్యాలయం నుండి విచారణ జరిపి మరల గ్రామ పంచాయతీ రికార్డులను నమోదు చేయమని ఉత్తర్వులు జారీ చేస్తారు.
Note:- తాసిల్దారు గారు ఇచ్చిన ఈ ఉత్తర్వులునే చాలామంది డెత్ సర్టిఫికేట్ గా భావించి తమ వద్ద ఉంచుకుంటుంటారు అది తప్పు, ఈ ఉత్తర్వులను తిరిగి గ్రామపంచాయతీ కార్యదర్శి వారికి ఇస్తే రికార్డులో నమోదు చేసి డెత్ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు.
వ్యక్తి మరణించిన సంవత్సరం దాటిన తరువాత
1. వ్యక్తి మరణించిన సంవత్సరం లోపు అయితే మండల తాహాశీల్దారు గారు ఉత్తర్వులు జారీ చేస్తారు సంవత్సరం దాటిన తర్వాత గౌరవ రెవిన్యూ డివిజనల్ అధికారి వారు ఉత్తర్వులు జారీ చేస్తారు.
2. ఈ ఉత్తర్వులు జారీ చేయడం కోసం కూడా పైన తెలిపిన పద్ధతిలోని NON AVAILABILITY CERTIFICATE మరియు నోటరీ తయారు చేసి ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ విచారణ జరిపి తహసిల్దార్ వారి ద్వారా డివిజనల్ రెవిన్యూ అధికారి వారికి పంపిస్తారు.
3. రెవెన్యూ డివిజనల్ అధికారి వారు ఇచ్చిన ఉత్తర్వులను తీసుకువచ్చి గ్రామపంచాయతీ కార్యదర్శి వారికి ఇచ్చినచో మరల ఆన్లైన్ లో నమోదు చేసి death సర్టిఫికెట్ మంజూరు చేస్తారు.
మరణ ధ్రువీకరణ పత్రం యొక్క ఉపయోగాలు:-
1. మరణించిన వ్యక్తికి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్న ఎడల వారి కుటుంబ సభ్యులకు ఆ డబ్బులు రావడానికి మరణ ధ్రువీకరణ పత్రం ఉపయోగపడుతుంది.
2. మరణించిన వ్యక్తికి ఏవైనా ఆస్తులు గాని సంపదలు గాని ఉన్న యెడల వారి కుటుంబ సభ్యుల పేర్లు మీదకు మారడానికి మరణ ధ్రువీకరణ పత్రం అవసరం.
3. మరణించిన వ్యక్తికి బ్యాంకు ఖాతాలు గాని లేదా మరి ఏ ఇతర ఎకౌంట్లు గాని, స్టాక్ మార్కెట్లో షేర్లు గాని వారి కుటుంబ సభ్యులకు మారడానికి మరణ ధ్రువీకరణ పత్రం అవసరం ఉంటుంది.
4. ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ చేసుకోవడానికి కచ్చితంగా మరణ ధ్రువీకరణ పత్రం అవసరం.
5. ఏవైనా ప్రభుత్వ పథకాలు మరణించిన వ్యక్తి యొక్క భార్యకు,కుటుంబ సభ్యులకు రావడం కోసం ఉదాహరణకు సామాజిక భద్రత పించను మొదలగునవి రావడానికి మరణ ధ్రువీకరణ పత్రం అవసరం ఉంటుంది.
ఇన్ని ఉపయోగాలు ఉన్న జనన,మరణ ధ్రువీకరణ పత్రాల నమోదు కొరకు ఇకనైనా సరే అలసత్వం వహించకుండా బిడ్డ పుట్టిన వెంటనే లేదా ఎవరైనా మరణించిన వెంటనే నమోదు చేసుకుని భద్రపరచుకుంటారని తెలియజేస్తున్నాం.
Nice Information
ReplyDeleteThank you for your concern
Delete