ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని కళ్యాణం విశిష్టత, ఆలయ చరిత్ర:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలో రంగ రంగ వైభవంగా శ్రీ కోదండ రామ కళ్యాణం చేయబోతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఒంటిమిట్ట ఎక్కడ ఉంది, దీని చరిత్ర ఏమిటి దీనికి ప్రస్తుతం ఇంత ప్రాధాన్యం ఎందుకు సంతరించుకుందో మొదలు వివరాలను కూడా ఇప్పుడు చూద్దాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు భద్రాచలంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రామ కళ్యాణం మరియు ఉత్సవాలను జరిపేవారు. అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వేరేగా విభజించబడిందో అప్పటినుండి ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలం గా గుర్తించి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు, చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవము మొదలగు ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించడం జరుగుతున్నాయి.
ఒంటిమిట్ట ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా లో రాజంపేటకు వెళ్లే మార్గంలో కడప నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది. బస్సు మార్గం అయితే కడప నుండి వెళ్ళవచ్చు. రైలు మార్గం అయితే సమీప రైల్వే స్టేషన్ లు రాజంపేట లేక కడప.
ఆలయ నిర్మాణం:
ఊరూరా భిక్షమెత్తి ఈ ఆలయానికి భూములు, భవనాలు, స్వామికి విలువైన ఆభరణాలు ఏర్పాటు చేశారు. ఈయన రామాయణాన్ని తెలుగులో రచించి డానికి “మందరం” అనే పేరుతో వ్యాఖ్యానం కూడా రాశారు.ఇంకొక కధనం ప్రకారం ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు (వీరు చోరులు అని కూడా అంటారు) ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలని అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు.
స్థల పురాణం:-
విశ్వామిత్రుడు తమ యాగ రక్షణ నిమిత్తం రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే తమతో తీసుకువెళ్లాడని విషయం తెలిసిందే, కానీ సీతారాముల కళ్యాణం జరిగిన తరువాత కూడా అలాంటి సందర్భం ఒకటి ఏర్పడింది. అదేమిటంటే మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీత ,లక్ష్మణ లతో కలిసి కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని ఆ తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణ ప్రతిష్ట చేశాడని ఇక్కడ ప్రజల విశ్వాసం .ఈ దేవాలయంలో శ్రీ రామ తీర్థం ఉంది. సీతాకోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని అంటారు.
మరిన్ని ఒంటిమిట్ట కోదండ రామాలయ విశేషాలు :
1.సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇంకొకటి ఇమాంబేగ్ బావి. 1640 సం. లో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఇమాంబేగ్. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడుట. చిత్త శుధ్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన మూడు సార్లు రాముణ్ణి పిలిచారట. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన ఆశ్చర్య చకితుడై, స్వామి భక్తుడిగా మారి, అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించాడు. ఆయన పేరుమీద ఆ బావిని ఇమాంబేగ్ బావి అటారు. అప్పటినుంచి ఎందరో ముస్లిం భక్తులు కూడా ఈ ఆలయం సందర్శిస్తూ వుంటారు.
2.మూడు గోపురాలతో, విశాలమైన ఆవరణలో అలరారే ఈ ఆలయం ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు.
3. ఈ ఆలయంలో మధ్య మండపంలో 32 స్తంబాలున్న రంగమంటపం వున్నది. సందర్శకులను ఆకట్టుకునే ఈ స్తంభాల మీద శిల్ప కళ చోళ, విజయనగర శిల్ప శైలిని పోలి వుంటుంది.
ఈ స్తంబాలపై రామాయణ, భారత కధలను చూడచ్చు.
4. గుడి ఎదురుగా సంజీవరాయ దేవాలయం, పక్కగా రధశాల, రధం వున్నాయి.
5.పోతన, అయ్యల రాజు రామభద్రుడు, ఉప్పు గుండూరు వేంకటకవి, వరకవి మొదలగు ఎందరో స్వామికి కవితార్చన చేసి తరించారు.
6.అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిమీద కొన్ని కీర్తనలు రచించారు.
ఒంటిమిట్టలో కోదండ రామ కళ్యాణం రాత్రే ఎందుకు చేస్తారు?
1.ఇక్కడ పౌర్ణమి వెన్నెలలో కోదండ రాముని కళ్యాణం నిర్వహిస్తారు. రాత్రి వేళల్లో కళ్యాణం జరగడానికి పురాణాల్లో ఒక కథ ఉంది.
2. విష్ణుమూర్తి, లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది.విష్ణుమూర్తి, లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో..నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు.
అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కధ ప్రాచుర్యంలో ఉంది.
ఇంత చరిత్ర కలిగిన శ్రీ ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణాన్ని చూసే అవకాశం ఉన్న వారందరూ కూడా హాజరై మన జన్మ సార్థకం చేసుకుంటారని తెలియజేసుకుంటున్నాము.